నీ సొంతం
ఒంటరితనంతో సౌదా చేసి,
ఆకాశాన్నంటే సౌధాలలో ఉంటూ,
నిశీధిలో శూన్యం చూస్తూ,
నిశరాత్రిలో నిశ్శబ్దం వింటూ,
చుట్టూ ఉన్న చీకట్లను కళ్ళల్లో దాచుకుంటూ,
నీ భయాలు, సంశయాలు ఎదుర్కుంటూ,
అడగని ప్రశ్నలకి జవాబు అన్వేషిస్తూ,
దొరకని జవాబుని పదేపదే ప్రశ్నిస్తూ,
గడచిన రోజుని నెమరవేసుకుంటూ,
పడుకుంటూ.. తరచూ మేలుకుంటూ..
రాజీ పడని రోజు రేపొస్తుందనుకుంటూ
ఆశగా నీవు ప్రతిరోజు గడుపుతావు.
కలలో ఆశలు నెరవేరడం సహజం,
ఆశలు కలగా మిగిలిపోవడం నిజం..
నీ ప్రయత్నం లోపించిందా అని ప్రశ్నించక,
ఓటమిని సహించక, నిజాన్ని గ్రహించక,
సమయం లేదని సమర్దించుకుంటూ
ఇవ్వాళ కుదరదు 'బిజీ' అనుకుంటూ
'తరువాత చూద్దాం.. సర్లే చేద్దాం'
అని నీతో నువ్వు రాజీ పడిపోకు...
కష్టం అనుకుంటే నీ ఇష్టాన్ని వదులుకో,
శ్రమ అనుకుంటే నీ భ్రమ తొలగించుకో
అసలేం కావాలో అది నిర్ణయించుకో !
నిలకడ లేని నీ మనసుకి,
మనుగడ గురించి అంత ఆలోచన దేనికి?
మనసుంటే మార్గం ఉంటుంది మిత్రమా,
ప్రయత్నించు.. పోరాడితే పోయిందేముంది ?
మనసు మనసుకి దూరాలు
మనిషి మనిషికి విభేదాలు
'ఎలా ఉన్నావు' అని అడిగే చిరునవ్వు
కనుమరుగయ్యిందని గుర్తించు నువ్వు.
బలహీనుడ్ని లూటి చేసి,
ప్రపంచం అది పోటి అంటుంది.
నీ ప్రమేయం లేకుండా పరిగెత్తిస్తుంది
పోటి ప్రవాహంలో నిన్ను ముంచేస్తుంది
నీ ఆశను, ఆశయాన్ని నిర్దేశిస్తుంది.
నువ్వు గెలిస్తే నీ వెంటొస్తుంది
నువ్వోడితే 'ఓస్.. ఇంతే' అంటుంది
వందల మందలో నిన్ను ఒంటరి చేస్తుంది.
మరి నలుగురి మెప్పుకోసం ఈ తపన దేనికి?
గెలవడమంటే కేవలం గుంపులో నడవడమా?
లేదా నీ దారిలో గమ్యానికి చేరి ఉనికి చాటడమా?
జీవించడం అంటే స్వేచ్చని పాటించమని మంత్రం
నీ తప్పు, నీ ఒప్పు, నీ పంతం, నీ సొంతం.
-కొన
మార్చ్ 30, 2014